గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు హత్య అనంతరం డెడ్‌బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమీర్ శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆదివారం తెల్లవారుజామున ఓఆర్‌ఆర్ సమీపంలో అమీర్ బైక్, సమీపంలో కాలిన డెడ్బాడీని పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. హత్యకు పాత పగలు కారణమా?, ఇతర వివాదాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చరీకి తరలించారు.
